ఎర్రవల్లిలో రాజకీయ రణరంగం
- స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన
- వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నం
- ఎర్రవల్లిలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాయాలు
- దామరకుంటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఘర్షణ
- రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్‌ఎస్.. ప్రతిగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
- రాళ్లు, చెప్పులతో ఇరువర్గాల దాడులు, పోలీసుల లాఠీచార్జ్
- ఫాంహౌస్‌కు వెళ్లకుండా హకీంపేట వద్ద కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు
గజ్వేల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి, దామరకుంట, వరదరాజపూర్ పరిసరాలు మంగళవారం రాజకీయ రణరంగంగా మారాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar)పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చాయి.
కాంగ్రెస్ ఎస్సీ విభాగం, దళిత సంఘాల నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పులతో నిరసన చేపట్టాలని నిర్ణయించాయి. వెయ్యి డప్పులతో ఫామ్‌హౌస్ వైపు కదులుతామని ప్రకటించడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి, ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఫామ్‌హౌస్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఘర్షణలను నియంత్రించే క్రమంలో స్వల్ప లాఠీచార్జి చేశారు. ఎర్రవల్లి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసనకు అడ్డుకట్ట
కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో బీఆర్‌ఎస్ కూడా ఎర్రవల్లిలో పార్టీ శ్రేణులను సమీకరించేందుకు ప్రయత్నించింది. ఉదయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమావేశమై నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా వారిని చెదరగొట్టారు. గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి వచ్చిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, రాధాకృష్ణ శర్మ, ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి మర్కుక్, గౌరారం, బేగంపేట తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
దామరకుంటలో మొదలైన ఘర్షణ
కేసీఆర్ ఫాంహౌస్ వైపు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కదులుతున్న సమయంలో మర్కుక్ మండలం దామరకుంట వద్ద ఉద్రిక్తత మొదలైంది. కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుల వాహనాలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో దామరకుంట పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లి వైపు కదలగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాటలో నర్సారెడ్డికి గాయాలయ్యాయి. ఆయనను ప్రజ్ఞాపూర్ ఆస్ప్ర తికి తరలించి చికిత్స అందించారు.
వరదరాజపూర్‌లో దిష్టిబొమ్మలు..
ఎర్రవల్లి సమీపంలోని వరదరాజపూర్‌లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ మాదిగల మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవు ని సతీష్ ఆధ్వర్యంలో వెయ్యి డప్పులతో ఫాం హౌస్‌ను ముట్టడించేందుకు తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ శ్రేణులు దహనం చేయగా, దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు, చెప్పులు రువ్వుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.
పసుపునీళ్లతో రోడ్డు శుద్ధి
కాంగ్రెస్ కార్యకర్తలు వరదరాజపూర్‌లోకి రావడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందించాయి. కాంగ్రెస్ నాయకుల రాకతో గ్రామం అపవిత్రమైందంటూ రోడ్డుపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు.
బీఆర్‌ఎస్ అగ్రనేతల ఎర్రవల్లి బాట
కాంగ్రెస్ శ్రేణులు ఫాంహౌస్ వైపు వస్తుండడంతో బీఆర్‌ఎస్ అగ్రనేతలు కూడా అప్రమత్తమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే హకీంపేట్ వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం వారు కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హకీంపేట, బొల్లారం ప్రాంతాల్లో పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.