మాజీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్(Sheila Dikshit) హయాంలో పనిచేసిన మాజీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా(Former Delhi Chief Secretary Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆయన వయసు 74 ఏళ్లు. 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మెహతా సెప్టెంబర్ 6న సెక్టార్ 82లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
అందులో ఆయన మానసిక, ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించినప్పటికీ, తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయలేదు. మెహతా 2007 నుండి 2010 నవంబర్‌లో పదవీ విరమణ చేసే వరకు ఢిల్లీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలోనే జాతీయ రాజధానిలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. అనేక కీలక రవాణా, విద్యుత్, పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించిన ఘనత కూడా ఆయనకు దక్కింది. ఆయన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.