వార్డు పర్యటనకు రాజకీయ రంగు వద్దు
మణికొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మణికొండ వార్డు నం. 127 పరిధిలోని పంచవటి కాలనీని డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి సందర్శించిన ఘటనపై ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తలు, వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారంపై పంచవటి కాలనీ ఆర్‌డబ్ల్యూఏ (RWA) అధ్యక్షుడు, యూఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్ తెలంగాణ అధ్యక్షుడు, ది సిటిజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘వన్ డే–వన్ వార్డు’ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ పర్యటన పూర్తిగా అధికారిక పరిపాలనా కార్యక్రమమని స్పష్టం చేశారు.
వ్యక్తుల రాజకీయ అభిప్రాయాలు, అనుబంధాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాజకీయ రంగు పులమడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా తన ఫొటోను ప్రచురించడం, ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడటంతో పాటు తన వ్యక్తిగత, ప్రజా ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన అధికారిక హోదాలో ఈ ఫొటోను ప్రచారం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు 24 గంటల్లో వివరణ (Clarification) ఇవ్వాలని సీతారాం ధూళిపాళ డిమాండ్ చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేయడం వల్ల వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.