చేవెళ్ల కోర్టుకే క్రిమినల్ కేసులు!
సామాన్యులకు తప్పనున్న ప్రయాణ భారం
మొయినాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని(Police station jurisdiction) క్రిమినల్ కేసుల విచారణను చేవెళ్ల కోర్టుకు మారుస్తూ ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు ఈ పరిధికి చెందిన క్రిమినల్ కేసులు రాజేంద్రనగర్ కోర్టులో కొనసాగుతుండగా, ఇకపై వాటి విచారణ చేవెళ్లలోనే జరగనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో స్థానిక ప్రజలకు, బాధితులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
తీరిన వేర్వేరు కోర్టుల తిప్పలు....
ఇప్పటివరకు మొయినాబాద్ పరిధిలోని సివిల్, ట్రాఫిక్, ఎక్సైజ్ రకం కేసులు చేవెళ్ల కోర్టులోనే జరిగేవి. కానీ కేవలం క్రిమినల్ కేసుల విచారణ కోసం మాత్రం రాజేంద్రనగర్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. వేర్వేరు కేసులు ఉన్న బాధితులు, సాక్షులు రెండు వేర్వేరు ప్రాంతాల్లోని కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ తాజా మార్పుతో అన్ని రకాల న్యాయ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా ఈ నిర్ణయం వల్ల రోజువారీ కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులకు ఆర్థికంగా, సమయం పరంగా ఎంతో కలసిరానుంది:
రవాణా వెసులుబాటు
మొయినాబాద్ నుంచి చేవెళ్లకు నేరుగా ఒక్క బస్సులోనే చేరుకునే వెసులుబాటు ఉంది. రాజేంద్రనగర్ వెళ్లాలంటే మాత్రం దారిలో బస్సులు మారాల్సి వచ్చేది.కోర్టు వాయిదాల కోసం ఒకే రోజులో ఎక్కువ సమయం ప్రయాణానికే కేటాయించాల్సి రావడంతో పనులు మానాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ శ్రమ గణనీయంగా తగ్గనుంది. న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం విచారణలో ఉన్న తమ కేసుల తదుపరి ప్రక్రియ ఏ కోర్టు పరిధిలో జరగనుందో సంబంధిత న్యాయవాదుల ద్వారా సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.