కల్తీ కల్లు.. పెరిగిన ధరలు!
బిజినేపల్లి, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): మండలంలోని పాలెం గ్రామంలో మడ్డి కల్లు విక్రయిస్తూ, కల్తీ కల్లు అమ్మకాలు సాగించడమే కాకుండా ధరలు పెంచడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామ పెద్దలు కల్లు దుకాణాన్ని (Shop) మూసివేయించారు. కల్తీ కల్లు తయారు చేసి, సీసాలను శుభ్రపరచకుండా మడ్డి కల్లు విక్రయించడమే కాకుండా, సీసా కల్లుపై ధరలు (Prices) పెంచడంపై పాలెం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కల్లును అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ (Excise Department) అధికారులు పట్టించుకోకుండా వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో కల్తీ కల్లు తయారు చేసే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని, డబ్బును దోచుకుంటున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దసరా పండుగ నుంచి కల్తీ కల్లు ధరలను పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. కల్తీ కల్లును విక్రయించడం మానుకొని, స్వచ్ఛమైన కల్లు (Pure Toddy) విక్రయిస్తూ ధరలు పెంచుకోవాలని వారు సూచిస్తున్నారు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు విక్రయాలను అధికారులు అరికట్టలేకపోతున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి కల్తీ కల్లు సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని పాలెం గ్రామస్తులతో పాటు మండల ప్రజలు కోరుతున్నారు.