పోలీసు ఎక్స్‌గ్రేషియా పెంపు
- కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐలకు రూ. కోటి
- ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు రూ. కోటి 25 లక్షలు
- డీఎస్పీ, అదనపు ఎస్పీకి రూ. కోటి 50 లక్షలు
- ఎస్పీ, ఐపీఎస్‌లకు రూ. 2 కోట్ల పరిహారం
- హోంగార్డులకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
- 2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే 2028 నాటికి పోలీసు శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) తెలిపారు. ఇప్పటికే 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని, మిగతా ఖాళీలను కూడా విడతల వారీగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉం టుందని, ఆయా కుటుంబాలకు పరిహారా న్ని భారీగా పెంచినట్లు వెల్లడించారు. బు ధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషా మహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపానికి డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి నివాళులర్పించారు. అమరవీరుల సేవలను స్మరిస్తూ రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం భావోద్వేగంతో కూడిన రోజని, సమాజం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసుల సేవలను మరువలేమన్నారు. అమరుల కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని, వారి కుటుంబాలు ఒంటరివి కావని, తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ, సమాజం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
పరిహారం భారీగా పెంపు..
పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని భారీగా పెంచినట్లు వెల్లడించారు.
కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐల కుటుంబాలకు రూ.45 లక్షల నుంచి రూ. కోటి, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు రూ.45లక్షల నుంచి రూ. కోటి 25 లక్షలు, డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు కోటి రూపాయల నుంచి రూ.2 కోట్లకు పరిహారం పెంచినట్లు తెలిపారు.
ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని సీఎం స్పష్టం చేశారు. అలాగే హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ. 10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని, పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని, ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం చేశామని సీఎం వెల్లడించారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీసు సిబ్బంది పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈగల్ సేవలు భేష్..
కాలంతో పాటు నేర స్వభావం మారుతోందని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖను ఆధునీకరించాలని నిర్ణయించామని, అందులో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీని అభినందించారు. కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు టీజీ సేఫ్ వ్యవస్థను తీసుకొచ్చామని వెల్లడించారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మరిన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలని, మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఎంత పెరిగినా పోలీసులు మానవీయ దృక్పథం మారకూడదన్నారు.