గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
గంభీరావుపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు (Investigation) చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని, పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్ అప్లికేషన్లను (Web Applications) సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా (Surveillance) ఉంచాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్ఐ బాలరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.