రైతు, వ్యవసాయ కూలీల సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

17-09-2026 | 11:12pm

- ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుల పాపయ్య

ఆర్మూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రైతు, వ్యవసాయ కూలీల సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం(All India Agricultural Workers Union) ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలతో ప్రచార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమన్న రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను వివరించారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు తగిన ఉపాధి, కూలి రేట్లు, భూమి వంటి ప్రాథమిక సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్పుల భారంలోకి వెళ్లకుండా ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అవసరమైన సహకారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరంలో తగినన్ని రోజులు ఉపాధి కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. భూమిలేని వ్యవసాయ కూలీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించి, సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించాలని అన్నారు.

రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా సామూహిక సమస్యలుగా గుర్తించి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతు, కూలీల సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణ కేంద్రంలో ఏఐకేఎంఎస్ నాలుగో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు భూమన్న తెలిపారు. సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు దేవన్న, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సూర్య శివాజీ, అరుణోదయ జిల్లా అధ్యక్షులు అబ్దుల్, అనంతి, గంగన్న, ప్రిన్స్, అంజి, గోపాల్, రైతులు, వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు