లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి
* ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ
హనుమకొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా అదాలత్ సర్కిల్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) కోరిక మేరకు పక్కనే ఉన్న లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కాలంలో లింగాల కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంత్రికి వివరించారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వపరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.