ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టర్ అండ్ మిసెస్ గ్రే

04-11-2026 | 05:25am

బాలీవుడ్ నటుడు వివేక్ ఆనంద్ ఒబెరాయ్(Bollywood actor Vivek Anand Oberoi), సౌత్ బ్యూటీ నిత్యా మీనన్(South beauty Nithya Menen) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే(Mr. and Mrs. Grey...)’. అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహించారు. వేవ్‌బ్యాండ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ ఝున్‌ఝున్‌వాలా, శిఖా కరణ్ అహ్లువాలియా సంయుక్తంగా నిర్మించగా, రెడ్ ఐ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి, శ్రేయా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది.

‘మిషన్ మంగళ్’ (2019), ‘బ్రీత్’ వెబ్ సిరీస్ తర్వాత నిత్యా మీనన్ నటిస్తున్న పూర్తి స్థాయి హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. గడచిన మూడేళ్లుగా నిర్మాణ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖరి నెల రేసులో నిలుస్తూ, 2026 డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం సైకలాజికల్ సస్పెంస్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది.

‘నువ్వు ఎవరికైతే ప్రాణం ఇస్తావో.. వారి వల్లే నీ ప్రాణానికి భయం వస్తే ఎలా ఉంటుంది?’, ‘ప్రేమలో గ్రే (నలుపు-తెలుపుల కలయిక) అనే రంగు కూడా ఉంటుంది’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్లతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. భార్యాభర్తల బంధంలో ఉండే నమ్మకం, మోసం, దాగి ఉన్న రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని చిత్రబృందం పేర్కొంది. రహస్యాలు, మైండ్ గేమ్స్, ఊహించని మలుపులతో సాగే ఈ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు