లలితాత్రిపురసుందరి దేవిగా వనదుర్గమ్మ
అంగరంగ వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
తీరొక్క మొక్కులు చెల్లించుకుంటున్న భక్తజనం
రేపు దుర్గాదేవిగా వనదుర్గమ్మ దర్శనం
పాపన్నపేట: భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి(Vanadurga Devi) క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Devi Sharannavaratri Celebrations) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఏడవ రోజు శనివారం సప్తమి పురస్కరించుకొని వనదుర్గామాతను శ్రీ లలితాత్రిపురసుందరి దేవి(Sri Lalithatripurasundari Devi) రూపంలో, నారింజ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి నారింజ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు దుర్గాదేవిగా వనదుర్గమ్మ దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం వనదుర్గామాత దుర్గా దేవి రూపం, ఎరుపు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని అర్చకులు, ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.