ఎనిమిదేళ్లుగా సేవా బాటలో..ఛత్రపతి శివాజీ యువసేన!

31-10-2026 | 11:09am

గండీడ్, విజయక్రాంతి: యువతలో ఐక్యత, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఛత్రపతి శివాజీ యువసేన యూత్ అసోసియేషన్ సల్కర్‌పేట్ గ్రామంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందుతోంది.

అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామ సమస్యల పరిష్కారంతో పాటు విద్యాభివృద్ధి, గ్రామ పరిశుభ్రత, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం (New Committee) ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షుడిగా ఏ. నవీన్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నల్ల శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే. అరుణ్ జీ, ప్రధాన కార్యదర్శిగా కె. నరేష్, కార్యదర్శిగా నల్ల వీరేశం బాధ్యతలు స్వీకరించారు.

యువతను సామాజిక సేవలో భాగస్వాములను చేస్తూ గ్రామాభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని నూతన కార్యవర్గం సంకల్పించింది.

మరిన్ని వార్తలు