‘గౌరవెల్లి’ సమస్యలను సత్వరం పరిష్కరించాలి

04-10-2026 | 05:25am
  1. జలాశయం 98 శాతం పూర్తి
  2. మిగతా పనులకు ప్రాధాన్యం
  3. ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదించాలి
  4. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశం
  5. మంత్రి పొన్నంతో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు పనులపై సమీక్ష

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): గౌరవెల్లి ప్రాజెక్టును నిర్ణీత(Gouravelli Project Progress) గడువులోగా పూర్తి చేసి 1.06లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్య లను త్వరగా కొలిక్కి తేవాలని సూచించారు.

సచివాలయంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయం పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయని, రైతుల పొలాలకు నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువలు, పంపిణీ కాలువలను సకాలంలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగిన బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకొని పనుల్లో పురోగతి చూపాలని ఆదేశించారు.

ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.1,343.59 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. ఇందులో ధరల పెరుగుదలతో కలిపి నిర్మాణ పనులకు రూ.886.76 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ.456.83 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించా రు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.114.389 కోట్లు అవసరమని పేర్కొన్నారు. పనుల వారీగా స్పష్టమైన గడువులు నిర్ణయించాలని, ఆర్థిక, పరిపాలన, న్యాయపరమైన అడ్డంకులు  ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తేవా లని పేర్కొన్నారు. 

నిర్వాసితులకు పరిహారం త్వరగా చెల్లించాలని స్పష్టం చేశారు. జలాశయానికి సంబంధించిన రూ.1,457.979 కోట్ల సవరించిన అంచనాను తదుపరి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ అనుమతి లేకుండానే జలాశయ విస్తరణ చేపట్టడంతో ఈ అంశం జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎన్జీటీ) చేరిందని మంత్రి తెలిపారు.

పర్యావరణ అనుమతి పొందే వరకు తదుపరి నిర్మాణ పనులు చేపట్టరాదని తాజాగా ట్రిబ్యునల్ ఆదేశించిం దని, దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈనెల 8న జరగనున్న పర్యావరణ అనుమతి ప్రతిపాదన పరిశీలన సమావేశానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

అలాగే ఈనెల 16న ఎన్జీటీలో జరగనున్న విచారణకు ముందే న్యాయపరమైన పరిణామా లు, నవీకరించిన ప్రాజెక్టు రికార్డులను ట్రిబ్యునల్ ముందుంచాలని సూచించారు. ఇందుకోసం అడ్వకేట్ జనరల్, ప్రాజెక్టు తరఫు న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.    

3,850 ఎకరాల భూ సేకరణ..

జలాశయానికి 3,870 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటికే 3,850 ఎకరాలు సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మిగిలిన 20 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని హైదరాబాద్‌లోని భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపన అథారిటీ వద్ద జమ చేసినట్లు పేర్కొన్నారు. కాలువల కోసం భూసేకరణకు జిల్లాల వారీగా గడువులు నిర్ణయించాలని సూచించారు.

నిర్వాసిత కుటుంబాల వినతులను పరిశీలించి, సంబంధిత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పునరావాస ప్రయోజనాలను త్వరగా అందించాలని ఆదేశించారు. ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో వినియోగానికి అనువుగా ఉన్న భాగాల నిర్వహణ, మరమ్మతులపైనా మంత్రి సమీక్షించారు. పంపిణీ కాలువల పనులకు అవసరమైన అంచనాలు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియకు ఆచరణ సాధ్యమైన గడువులు నిర్ణయించాలని సూచించారు.

వచ్చే సాగు సీజన్‌కు నీటిని అందించేలా కాలువలను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. మిగిలిన ప్రధాన కాలువలు, పంపిణీ కాలువలు, అనుబంధ పనులకు సంబంధించిన రూ.88.89 కోట్ల సవరించిన అంచనాపై తదుపరి చర్యల కోసం చర్చించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలు, పర్యావరణ అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీనియర్ న్యాయవాదుల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

పర్యావరణ ప్రభావ అంచనా, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు, మూడు సీజన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరివేశ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి  శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) ఓ.వీ.రమేష్‌బాబు, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శి కే. శ్రీనివాస్, భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపన కమిషనర్ శివకుమార్ నాయుడు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి తదితర నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు