అవినీతికి తావులేకుండా అర్హులకు లబ్ధి
తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
బతుకమ్మ వేడుకల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలి
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు, మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకం అమలులో అవినీతికి తావులేకుండా అర్హులకు లబ్ధి చేకూర్చాలి
ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకల(Bathukamma celebrations)ను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్(Collector Divakara TS) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి బతుకమ్మ వేడుకలు, ఇందిరమ్మ మహిళా డెయిరీ కార్యక్రమం(Indiramma Women's Dairy Scheme) అమలుపై జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ... 2011లో తాను బతుకమ్మ పండుగ గురించి పెద్దగా వినలేదని, నేడు ఈ పండుగ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను వైభవంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. అందరినీ భాగస్వాములను చేస్తూ, పండుగ కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అన్ని మండలాల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, స్థానిక సంస్థల అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి బతుకమ్మ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలు బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు, బతుకమ్మ నిమజ్జన ప్రాంతాల్లో ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు, తదితర అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.