బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఉప ముఖ్యమంత్రి
పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం
ముదిగొండలో ‘బ్రేక్ఫాస్ట్’ పథకం అమలుపై ఆరా
ఖమ్మం,(విజయక్రాంతి): "విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి.. ఉన్నత శిఖరాలకు ఎదగాలి" అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం, వనం వారి కృష్ణాపురం గ్రామం(Krishnapuram village)లోని పాఠశాలను సందర్శించిన ఆయన, అక్కడ విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... "ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన మన ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తుకు పెద్దపీట వేస్తోంది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఉదయం వేళ 'బ్రేక్ఫాస్ట్' పథకాన్ని(Breakfast scheme), మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా యూనిఫాంలు, పుస్తకాలు, షూస్, టైలు అందజేస్తున్నాం. పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం" అని తెలిపారు.
రుచికరంగా బ్రేక్ఫాస్ట్.. సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉదయపు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ముదిగొండ మండలం(Mudigonda Mandal)లో పథకం అమలు తీరును డిప్యూటీ సీఎం నేరుగా ఆరా తీశారు. "ఉదయం బ్రేక్ఫాస్ట్ వేడిగా, రుచిగా వస్తోందా?" అని విద్యార్థులను అడగ్గా, విద్యార్థులంతా ముక్తకంఠంతో "చాలా బాగుంది" అని ఎంతో సంతోషంగా సమాధానమిచ్చారు. మధ్యాహ్న భోజనం కూడా ఎంతో రుచికరంగా ఉంటోందని వారు వివరించారు. ఈ సంభాషణలో భాగంగా పాఠశాలకు గణిత ఉపాధ్యాయుడు (మాథ్స్ టీచర్) కావాలని విద్యార్థులు కోరగా, ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. తక్షణమే గణిత ఉపాధ్యాయుడిని నియమించాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ దివాకరను ఆదేశించారు.
మధిర నియోజకవర్గంలో నూతనంగా నిర్మించబోతున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' నిర్మాణ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్టులు రూపొందించిన పాఠశాల నమూనాలను (డిజైన్లను) క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నెల 25 నాటికి డ్రాఫ్టింగ్ డిజైన్లు, అంచనాలు (ఎస్టిమేషన్స్) పూర్తి చేసి పరిపాలనా అనుమతుల కోసం ఈఎన్సీ కార్యాలయానికి పంపుతామని, అక్టోబర్ 28 నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం, నవంబర్ 1 నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, పనుల పురోగతిపై వారం వారం క్యాలెండర్ ప్రకారంగా సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్కు నిర్దేశించారు.