ఆక్రమణల చెరలో గుండ్ల చెరువు కాలువ
హుజురాబాద్,అక్టోబర్ 26:(విజయక్రాంతి): హుజురాబాద్(Huzurabad) పట్టణంలోని గుండ్ల చెరువుకు నీరందించే ఎస్సారెస్పీ(SRSP) ఉపకాలువ ఆక్రమణలకు గురికావడంతో చెరువుకు నీరు చేరడం లేదని గుండ్ల చెరువు రక్షణ సమితి నాయకులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కింద వందల ఎకరాల ఆయకట్టు ఉండగా, చేపల పెంపకంపై ఆధారపడి 250 ముదిరాజ్ కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు.
ఎస్సారెస్పీ(SRSP) నుంచి వచ్చే 16ఏ ఉపకాలువను పలుచోట్ల ఆక్రమించడంతో పాటు అలైన్మెంట్ మార్చి ఇదే కాలువపై శాశ్వత నిర్మాణాలు చేపట్టారని, దీంతో సాగునీరు చెరువుకు చేరకుండా చిలుకవాగులోకి వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పట్టణంలోని పలు వార్డుల మురుగునీరు ఈ కాలువలో చేరడంతో నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లి సమీప నివాసితులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ నక్షా ఆధారంగా సర్వే చేసి ఆక్రమణలు తొలగించి నాలాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మురుగునీరు ఇదే కాలువలో చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ నిర్మించి, ఎస్సారెస్పీ వచ్చే సాగునీటిని గుండ్ల చెరువుకు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండె చెరువు రక్షణసమితి నాయకులు సాయికృష్ణ, అభినయ్, పసుల స్వామి, రైతులు క్యాస రమేష్, కొలిపాక చిన్న, దేవుని సమ్మయ్య, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.