రైతు హామీలు అమలు చేయాలి
దోమకొండ, అక్టోబర్ 26 (విజయ క్రాంతి): రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దోమకొండ తహసీల్దార్(Domakonda Tahsildar)కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ(Loan Waiver) చేయాలని, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాని రైతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధరపై అదనంగా రూ.500 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు.
రైతు బీమా, పంటల బీమా, పశువుల బీమా పథకాలను అమలు చేయాలని, రైతు బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోడు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమాన హోదా కల్పించాలని, 22ఏ నిషేధిత జాబితా నుంచి రైతుల పట్టా భూములను తొలగించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ప్రతి కమతానికి నీరందించాలని డిమాండ్ చేశారు.
పంటల కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించి, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డుల్లో అధిక వసూళ్లను అరికట్టాలని కోరారు. వన్యప్రాణుల నుంచి పంటలను రక్షించి, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మూతపడిన చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించి, చెరకు ధరను టన్నుకు రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సంగిశెట్టి రాజేశం, మండల అధ్యక్షుడు కొండ శ్రీనివాస్, కార్యదర్శి ఎడపల్లి గంగారం, ఉపాధ్యక్షుడు పోగుల గోవర్ధన్, పట్టణ అధ్యక్షుడు పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, కార్యదర్శి పురు బాపు రెడ్డి, పోగుల సిద్ధరాములు, నర్సింలు, వెంకటి, భూపతి రెడ్డి, కామిండ్ల లక్ష్మణ్, రాజిరెడ్డి, గాజులపల్లి శేఖర్, దుంపల చంద్రం తదితరులు పాల్గొన్నారు.