కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం
హుజురాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): కార్మికుల హక్కుల సాధన (Workers' Rights) కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు సాగిస్తోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించి, కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన తొలి కేంద్ర కార్మిక సంఘం ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) (All India Trade Union Congress) అని, 1920 అక్టోబర్ 31న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని ముంబై నగరంలో ఆవిర్భవించిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా (Four Labour Codes) విభజించి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తోందని విమర్శించారు. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన క్లెయిమ్‌లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి యథావిధిగా లేబర్ బోర్డుకు అప్పగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, జిల్లా నాయకులు కన్నం సదానందం, బొజ్జ సదానందం, ఎండీ బాదుల్లా, పిట్టల తిరుపతి, ఆరెపల్లి తిరుపతి, గోదారి లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, పిట్టల వెంకటయ్య, సాయి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.