వెదురు సాగుతో స్థిరమైన జీవనోపాధి
అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి
పలిమెల,(విజయక్రాంతి): వెదురు సాగుతో రైతులు(Farmers), మహిళా సంఘాలు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి పొందవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి(Additional Collector Vijayalakshmi) అన్నారు. మంగళవారం పలిమెల మండలంలోని దమ్మూరు, బూరుగూడెం ప్రాంతాల్లో ఆమె పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. దమ్మూరులో ఫామ్ పాండ్ పనులను తనిఖీ చేసి కూలీల హాజరు, పనుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. కూలీలకు మెరుగైన వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫామ్ పాండ్లను వ్యవసాయం, అనుబంధ జీవనోపాధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దమ్మూరులో మహిళా సంఘాల సమావేశంలో పాల్గొని వెదురు సాగు ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందవచ్చన్నారు.బూరుగూడెం అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్య, ఆరోగ్యం, హాజరు, వసతులను పరిశీలించారు. పిల్లల పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో సాయి పవన్, ఏపీవో రాజయ్య, ఏపీఎం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.