ఆశ వర్కర్ల అక్రమ అరెస్టుల.. తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
దమ్మపేట,(విజయక్రాంతి): మంగళవారం ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన సమస్య లు నెరవేర్చాలని హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులు చేయడమేనా అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ 18,000/- ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడగటం రేవంత్ రెడ్డి పాలనలో నేరమైందని అన్నారు. ఆశ వర్కర్ల ఆరు నెలల పిఆర్సి ఎరియర్స్ పెండింగ్ లో ఉన్న లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఏఎంసీ పిఎంసి టార్గెట్స్ ను రద్దు చేయాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీత, రజిని, సంధ్, నాగమణి, వరదరాని, సుజాత, రాధ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.