106 ఎకరాల భూమిపై సీఎం వ్యాఖ్యలు అవాస్తవం
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
భూపాలపల్లి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణంలోని 106 ఎకరాల అటవీ భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కబ్జాలకు అనుకూలంగా 22ఏ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.
గురువారం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూర్బన్ నిధులతో జయశంకర్ ఏకో పార్కును అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, నడక మార్గాలు, పిల్లల ఆట స్థలంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ భూమిని అప్పటి ప్రభుత్వం తనకు దారాదత్తం చేసిందన్న సీఎం వ్యాఖ్యలు సత్యదూరమన్నారు.1985లో మహమ్మద్ అబ్దుల్ కాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టులో కేసు వేశారని, న్యాయస్థానాల విచారణ అనంతరం 2021లో ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినదిగా తీర్పు వచ్చిందని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరగగా అటవీ అధికారులతో కలిసి వాహనాలు సీజ్ చేయించి కేసులు నమోదు చేయించామని చెప్పారు.2021లో అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సహకారంతో అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, 2024లో సుప్రీంకోర్టు తీర్పుతో ఆ భూమి అటవీ భూమిగానే నిర్ధారణ అయిందని వివరించారు. తాను 106 ఎకరాలు కబ్జా చేసినట్లు సీఎం నిరూపించాలని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తనపై గతంలో 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు చేశారని, వాటిపై క్రిమినల్, పరువు నష్టం కేసులు ఇప్పటికే దాఖలై విచారణలో ఉన్నాయని తెలిపారు. తాజా ఆరోపణలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 22ఏ భూముల వ్యవహారంపై సమగ్ర, స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని గండ్ర డిమాండ్ చేశారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమైందని ఆరోపిస్తూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం, ఉద్యోగాలు, ఉద్యోగ క్యాలెండర్, విద్యార్థులకు స్కూటీలు, కులగణన, దళిత, గిరిజన సంక్షేమ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జయశంకర్ ఏకో పార్కు అభివృద్ధికి తన ఎమ్మెల్యే పదవీకాలంలో డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేయించి, హరితహారం ద్వారా మొక్కలు నాటించి అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజా ప్రయోజన ప్రాజెక్టును వ్యక్తిగత లాభంతో ముడిపెట్టడం సరికాదన్నారు. వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని ముఖ్యమంత్రిని కోరారు.