UPI రాజ్యంలో Apple Pay

30-09-2026 | 09:46am

ఐఫోన్ యూజర్లకు బిగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పేమెంట్ సర్వీస్‌గా ఉన్న Apple Pay భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిదశలో Axis Bankను బ్యాంకింగ్ భాగస్వామిగా ఎంచుకుని సేవలను ప్రారంభించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో భారత్‌లోని భారీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లో Apple మరో కీలక అడుగు వేసింది. అయితే Apple Pay ఎంట్రీ ప్రారంభంలో పరిమితంగానే ఉండనుంది. అర్హత ఉన్న Axis Bank Visa, Mastercard కార్డులను Apple Walletలో యాడ్ చేసుకుని Apple Pay ద్వారా ఆన్‌లైన్ కొనుగోళ్లు, సపోర్ట్ చేసే టెర్మినల్స్ వద్ద కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న RuPay నెట్‌వర్క్ ప్రారంభ దశలో Apple Payకు మద్దతు ఇవ్వడం లేదు.

UPIకి Apple Pay పూర్తిగా భిన్నం

భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది UPI. QR కోడ్ స్కాన్ చేసి నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లింపులు చేయడం కోట్లాది మందికి రోజువారీ అలవాటుగా మారింది. Apple Pay మాత్రం ప్రధానంగా కార్డు ఆధారిత పేమెంట్ సిస్టమ్. అందువల్ల UPI తరహాలో ప్రతి బ్యాంక్, ప్రతి పేమెంట్ టెర్మినల్‌లో వెంటనే పనిచేయదు. అంటే Apple Payకు సపోర్ట్ చేసే కార్డు ఉన్నప్పటికీ.. పేమెంట్ టెర్మినల్ కూడా Apple Payను ఎనేబుల్ చేసి ఉండాలి. ఒక టెర్మినల్‌లో పేమెంట్ పనిచేసి, మరో టెర్మినల్‌లో పనిచేయకపోవచ్చు. దీంతో ప్రారంభ దశలో Apple Pay అక్సెప్టెన్స్ ప్రతిచోటా ఒకేలా ఉండకపోవచ్చు.

HDFC, ICICI, SBI కార్డుల పరిస్థితి ఏంటి?

ప్రారంభ దశలో HDFC Bank, ICICI Bank, SBI Card సేవలు Apple Payలో అందుబాటులో ఉండకపోవచ్చని TechCrunch నివేదించింది. ఈ సంస్థలతో Apple వాణిజ్య నిబంధనలపై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. Apple Pay భారత్‌లోకి రావడం ఐఫోన్ వినియోగదారులకు కొత్త పేమెంట్ ఆప్షన్‌ను అందించడమే కాకుండా.. దేశంలో పెరుగుతున్న ప్రీమియం క్రెడిట్ కార్డు వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని Appleకు ఇస్తోంది. అయితే UPI ఇప్పటికే భారీ స్థాయిలో విస్తరించిన మార్కెట్‌లో Apple Pay ఎంతవరకు విస్తరిస్తుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. ఇదిలా ఉండగా, భారత్ Appleకు ఇప్పటికే కీలక మార్కెట్‌గా మారుతోంది. ఐఫోన్ విక్రయాలతో పాటు దేశంలో తయారీ, రిటైల్ కార్యకలాపాలను కూడా కంపెనీ విస్తరిస్తోంది.

మరిన్ని వార్తలు