నిమజ్జనం ఏర్పాట్లపై నిర్లక్ష్యం!
గణనాథులు వచ్చి రెండు రోజులైనా.. ఒక్కరోజు ముందు హడావుడిగా పనులు
ముందస్తు ప్రణాళిక లేక భక్తులకు తప్పని ఇబ్బందులు
ట్రాక్టర్లతోనే విగ్రహాలను నీటిలోకి దింపుతున్న వైనం
సీసీ కెమెరాలు, లైట్లు, స్టేజి, తాగునీటి సౌకర్యాలపై నిర్లక్ష్యం
కాంట్రాక్టర్ పనితీరుపై విమర్శలు.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
రెండు రోజులుగా విగ్రహాలు వచ్చినా భక్తులకు రక్షణ చర్యలు ఏవీ?
కోదాడ సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): గణేష్ నిమజ్జనానికి అధికారులు, కాంట్రాక్టర్లు(Contractors) చేపట్టాల్సిన ఏర్పాట్లు చివరి నిమిషంలో హడావుడిగా సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమజ్జనానికి వారం రోజుల ముందే పూర్తికావాల్సిన పనులు ఒక్కరోజు ముందు చేపట్టడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితమే నిమజ్జనానికి గణనాథుల విగ్రహాలు తరలివచ్చినా.. భక్తులకు, విగ్రహాలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రాక్టర్లతోనే నిమజ్జనం
విగ్రహాలను సురక్షితంగా నీటిలోకి దింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. కొన్ని చోట్ల భక్తులే ట్రాక్టర్ల సహాయంతో విగ్రహాలను నీటిలోకి దింపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.
చివరి నిమిషంలో హడావుడి
సీసీ కెమెరాలు, లైట్లు, స్టేజి, భక్తులకు తాగునీరు, రక్షణ చర్యలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. పనులు చివరి నిమిషం వరకు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ ఏది?
నిమజ్జన ఏర్పాట్ల బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయించాల్సి ఉన్నా.. చివరి రోజు వరకు పనులు కొనసాగడంపై అధికారుల పర్యవేక్షణ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితమే గణనాథులు తరలివచ్చినా.. భక్తుల రక్షణకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.