మంథని పట్టణ అభివృద్ధే శ్రీధర్ బాబు ధ్యేయం
రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
మంథని, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు.
గురువారం మంథని పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్‌తో కలిసి వారు పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో నష్టపోతున్న వారిని సంప్రదించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో ఎక్కడా పక్షపాత వైఖరికి తావివ్వకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టంగా సూచించినట్లు వారు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయే వారికి నిబంధనల మేరకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
అలాగే పట్టణంలోని మూల మలుపుల వద్ద రహదారులు విశాలంగా ఉండేలా, నాలుగు రోడ్లు కలిసే ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. గతంలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో రహదారి పక్కనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేసి, రహదారులను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వారు తెలిపారు.