బీజేపీతో పొత్తుండదు

01-10-2026 | 05:10am
  1. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం
  2. రెండేండ్లలో కేసీఆర్ సీఎం కావడం ఖాయం
  3. తెలంగాణ ప్రయోజనాల కంటే ఢిల్లీ నాయకత్వానికే రేవంత్ విధేయత 
  4. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు 
  5. ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీకి పొత్తు ఉండే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. గత 26 ఏండ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో తాము పొత్తు పెట్టుకోలేదన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని తెలిపారు. భావజాలప రంగా, సైద్ధాంతికంగా బీజేపీకి బీఆర్‌ఎస్ వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, రెండేండ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు. బుధవా రం కేరళలోని కొచ్చిలో జరిగిన ‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రజలు తమ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: చాక్లెట్ బాక్సుల్లో 25 కోట్ల కొకైన్

‘తెలంగాణలో ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్.. రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ పరిస్థితి కనిపిస్తున్నది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిలో ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. నేను  సీఎం కావడం లేదు.. ప్రజలు కోరుకుంటున్నది కేసీఆర్‌నే’ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఢిల్లీ నాయకత్వానికే సీఎం రేవంత్‌రెడ్డి విధేయత చూపుతున్నారని ఆయన విమర్శించారు.

జనాభా ప్రాతిపదికన కరెక్ట్ కాదు..

జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుందన్నారు. చట్టసభల్లో సీట్ల సంఖ్య పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు.

కేవలం పార్లమెంట్ స్థానాలను పెంచడం వెనుక ఉద్దేశం ఏమిటన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకే మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే తాము మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. 

సిద్ధాంతం మారదు..

తమ పార్టీ పేరును టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చడంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నేను షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన షారుఖ్ ఖాన్ అయిపోతానా?’ అని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు మారినంత మాత్రాన సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం, ప్రజలపై  అంకితభావం మారవని చెప్పారు.

ఇవి కూడా చదవండి: నేలమట్టం చేద్దాం!

తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయికి వెళ్లి విజయాలు సాధిస్తున్నప్పుడు, తెలుగు నేలపై పుట్టిన రాజకీయ పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు వెళ్లకూడదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామని వివరించారు. 

దేవుళ్ల పేరిట విభేదాలెందుకు? 

మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజలు ఆరాధించే రాముడు, శివుడి మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలూ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని.. ఉద్యోగాల కల్పన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి:  సీఎం సభకు కాంగ్రెస్ కదలిక

ఇటీవల ఓ జాతీయ మీడియాలో వచ్చిన ఇన్వెస్టిగేషన్ కథనంలోని అంశాలపై విస్తృత చర్చ జరుగుతున్నదని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాల్సిన బాధ్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ యువతతో కలిసి నడవడంలో, ప్రజలకు అండగా నిలవడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు.

మరిన్ని వార్తలు