విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఉప ముఖ్యమంత్రి
ముదిగొండ, (విజయక్రాంతి): "విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి.. ఉన్నత శిఖరాలకు ఎదగాలి" అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం, వనం వారి కృష్ణాపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఆయన, అక్కడ విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ "ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన మన ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తుకు పెద్దపీట వేస్తోంది. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఉదయం వేళ 'బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని, మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా యూనిఫాంలు, పుస్తకాలు, షూస్, టైలు అందజేస్తున్నాం. పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం" అని తెలిపారు.