విల్సన్ బాండ్‌పై వివాదం.. బహిరంగ చర్చకు రైతుల సవాల్!

10-10-2026 | 11:06am

కన్నాయిగూడెం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): విల్సన్ అగ్రి సైన్స్ బాండ్‌పై శుక్రవారం పలు దినపత్రికల్లో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఏటూరు, సింగారం, చింతగూడెం, బుట్టాయిగూడెం, ముప్పనపల్లి, గుర్రేవుల గ్రామాలకు చెందిన 25 నుంచి 30 మంది రైతులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముప్పనపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల అశోక్ అనే వ్యక్తి విల్సన్ అగ్రి సైన్స్ బాండ్‌పై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రైతులు పేర్కొన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (Media) ప్రతినిధులకు తప్పుడు సమాచారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంపెనీ ప్రతినిధులు సూచించిన నిబంధనల మేరకే మిర్చి పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. పంట సాగు సమయంలో కంపెనీ ప్రతినిధుల సూచనల మేరకే పురుగుమందుల పిచికారీ, ఎరువుల వినియోగం చేపడుతున్నామని వివరించారు. కంపెనీ ప్రతినిధులు గానీ, ఎరువుల దుకాణాల యజమానులు గానీ తమను ఎక్కడా ఇబ్బందులకు గురిచేయడం లేదని స్పష్టం చేశారు. ముప్పనపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల అశోక్ వద్ద విల్సన్ అగ్రి సైన్స్ సంస్థ రైతులను మోసం చేసినట్లు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని రైతులు సవాల్ విసిరారు. గతంలో అశోక్ కూడా విల్సన్ బాండ్ ద్వారా పంటలు సాగు చేసి, ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

విల్సన్ అగ్రి సైన్స్ కంపెనీతో ఒప్పందం (Agreement) చేసుకోవడం ద్వారా మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు తమ పంటలను కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. నిర్ణీత గడువులోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని వెల్లడించారు.కన్నాయిగూడెం మండలం నుంచి వరంగల్ మార్కెట్‌కు వెళ్లి మిర్చి విక్రయించినప్పటికీ అత్యధిక ధర లభిస్తుందనే హామీ ఉండదని, మార్కెట్‌లో దళారులు తక్కువ ధరలకు అడిగిన సందర్భాలు ఉన్నాయని రైతులు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో విల్సన్ అగ్రి సైన్స్ కంపెనీ ప్రతినిధులు రైతుల ఇళ్ల వద్దకే వచ్చి మార్కెట్‌లో లభించే అత్యధిక ధరకు మిర్చిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 

కంపెనీ ప్రతినిధులు రైతులకు మేలు చేస్తున్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని రైతులు అభిప్రాయపడ్డారు. అశోక్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని బహిర్గతం చేసి బహిరంగ చర్చకు రావాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు కుర్సం శివ, పళ్ళ వెంకటేశ్వర్లు, తడకల మధుకర్, వనపర్తి తిరుపతి, బుద్దె గౌరయ్య, సుబ్బుల సమ్మయ్య, సుబ్బుల సంజీవ్, బైరవేణి రమేష్, చిలకమరి శ్రీధర్, జంగ కృష్ణ, గోస్కుల లాలయ్య, తొంగళి సుమన్, అచ్చ ముత్తయ్య, అబ్బు సంపత్, బుద్దె చిట్టిబాబు, తిప్పనపల్లి విజయ్, తిప్పనపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు