వనదుర్గమ్మ..గులాబీ వర్ణంలో గాయత్రీ దేవిగా
పాపన్నపేట, అక్టోబర్ 12: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri Celebrations) కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సోమవారం వనదుర్గామాతను గాయత్రీ దేవి రూపంలో, గులాబీ రంగు చీరతో పాటు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణలో అమ్మవారు భక్తులకు శోభాయమానంగా దర్శనమిస్తున్నారు.
ఆలయ ఆవరణలోని గోకుల్ షెడ్‌లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వీరేశం, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరుసటి రోజు వనదుర్గామాత అన్నపూర్ణాదేవి రూపంలో, నీలం రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారని అర్చకులు రావికోఠి పార్థివ శర్మ తెలిపారు. అమ్మవారి అలంకరణ (Goddess Alankaram), ప్రత్యేక పూజల కోసం ఆలయంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.