పేదరికంపై కళ్యాణి విజయం.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక!

22-10-2026 | 11:09am

మహబూబ్‌నగర్ జిల్లా, మహమ్మదాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌కు చెందిన రుక్కంపల్లి కళ్యాణి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో భాగంగా నిర్వహించిన 5 కిలోమీటర్ల రోడ్ స్పీడ్ సైక్లింగ్ పోటీల్లో (Road Speed Cycling) ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.

తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాల్ ఆధ్వర్యంలో ఈ నెల 10న నారాయణపేట జిల్లా మక్తల్‌లోని ఎల్లమ్మకుంట–కొత్తగార్లపల్లి రోడ్డులో ఈ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి 126 మంది బాలబాలికలు పాల్గొన్న ఈ పోటీల్లో కళ్యాణి తన ప్రతిభను చాటుకుంది. ప్రథమ స్థానం సాధించి బి. గోపాల్ చేతుల మీదుగా పతకం, మెరిట్ సర్టిఫికెట్ (Merit Certificate) అందుకుంది.

ఈ విజయంతో 19 ఏళ్లలోపు విభాగంలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సైక్లింగ్ పోటీలకు కళ్యాణి ఎంపికైనట్లు ఈ నెల 21న తెలిసిందని ఆమె తల్లి రుక్కంపల్లి సంజమ్మ తెలిపారు. ప్రస్తుతం కళ్యాణి షాద్‌నగర్ గురుకుల మహిళా కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళ్యాణి కుటుంబ పరిస్థితులు అత్యంత దీనంగా ఉన్నాయి. ఆమె తండ్రి వెంకటయ్య పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్యను విడిచి వెళ్లిపోవడంతో, తల్లి సంజమ్మ కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా కూతురు క్రీడల్లో రాణించడం ఆ కుటుంబానికి గర్వకారణంగా మారింది.

ఈ నెల చివరి వారంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సైక్లింగ్ పోటీల్లో కళ్యాణి పాల్గొననుందని ఆమె అక్క రుక్కంపల్లి సోని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన కళ్యాణిని మహబూబ్‌నగర్ స్కూల్ గేమ్స్ కార్యదర్శి వేణుగోపాల్, మండల అధ్యక్షులు, సర్పంచ్, గ్రామ ప్రజలు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ కళ్యాణి ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు