శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన బండి సంజయ్

28-10-2026 | 09:15am

ముకరంపుర, అక్టోబర్ 28(విజయక్రాంతి): అయ్యప్ప స్వామికి సేవ చేసే అవకాశం అందరికీ దక్కదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) పేర్కొన్నారు.  కరీంనగర్ భగత్ నగర్ లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప స్వాములు శబరిమల మహా పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా పాదయాత్రలో పాల్గొనే అయ్యప్ప స్వాములను ఈ సందర్భంగా సన్మానించారు 

అనంతరం మాట్లాడుతూ... అయ్యప్ప స్వాముల యాత్రకు( Sabarimala Padayatra) సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడం, స్వాములకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా దాన్ని పరిష్కరించి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. స్థానిక పాలకవర్గం, చైర్మన్, ఈఓ మరియు అధికారులు అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో వరుసగా 26వ సారి శబరిమలకు మహా పాదయాత్ర చేపట్టడం అత్యంత అభినందనీయమని కొనియాడారు. నాలుగు, ఐదు రాష్ట్రాలు దాటుకుంటూ, వేల కిలోమీటర్లు నడిచి శబరిమల చేరుకోవడం సాధారణ విషయం కాదని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతోందని అన్నారు.

జాతీయ రహదారులపై(National Highways) వాహన చోదకులు నిద్రమత్తులో ఉండే ప్రమాదం ఉన్నందున రాత్రి వేళల్లో ప్రయాణాన్ని నివారించాలని సూచించారు. పాదయాత్ర మార్గంలో స్వాములకు ఎలాంటి సమస్య ఎదురైనా, ఇతర రాష్ట్రాల అధికారులతో మాట్లాడి సదుపాయాలు కల్పించడానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ యాత్ర ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలవాలని, భక్తులందరూ క్షేమంగా శబరిమల చేరుకుని స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి రావలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఈ.వో కాంతారెడ్డి, ప్రధాన పురోహితులు రాజయ్య , ఇతర పురోహితులు, ధర్మకర్తలు, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, కార్పొరేటర్లు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు