పిచ్చికుక్క బీభత్సం
ఐదుగురికి గాయాలు.. ఆరు గేదెలపై దాడి
గాయపడిన వారికి మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
రామగిరి, అక్టోబర్ 28(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం(Ramagiri mandal) రాజాపూర్ గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలో కనిపించిన వారిపై దాడి చేయడంతో ఐదుగురు గాయపడగా, ఆరు గేదెలు కూడా కుక్క దాడికి గురయ్యాయి. గాయపడిన వారిలో చిన్నపిల్లలు సైతం ఉన్నట్లు సమాచారం. బాధితులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పిచ్చికుక్క వరుస దాడులతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పరిస్థితిని గమనించిన గ్రామ యువకులు, వార్డు సభ్యులు అప్రమత్తమై కర్రలు పట్టుకొని గ్రామంలో గస్తీ తిరిగారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. రాజాపూర్‌లో పిచ్చికుక్క దాడులతో ప్రజలు, పశువులకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పిచ్చికుక్కను పట్టుకునేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.