భూ సమస్యకు మోక్షం?
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మండలం మామిడిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గిరిజనులు, రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న భూ సమస్యకు పరిష్కారం లభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ రైతులు భూముల హక్కుల కోసం సుమారు 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇల్లందు ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య నేతృత్వంలో తమ భూ సమస్యకు పరిష్కారం లభించనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మామిడిగూడెం గ్రామపంచాయతీ భూ పరిరక్షణ కమిటీ (COMMITTEE) కన్వీనర్, భూమి హక్కుల పోరాట నాయకుడు ముక్తి కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ రైతులు నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
భూ సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు గ్రామసభలో చర్చించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, 03-10-2026న జరగాల్సిన గ్రామసభ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తిరిగి 05-10-2026 సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించనున్నట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు.
గ్రామ ప్రజలు, రైతులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామసభను విజయవంతం చేయాలని కోరారు. భూ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు (VILLAGERS) సమష్టిగా ముందుకు రావాలని సూచించారు. గ్రామసభలో భూముల హక్కులు, సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. భూ హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశతో గ్రామ ప్రజలు (HOPE) వ్యక్తం చేస్తున్నారు.