‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్
- సీఈసీ, సర్‌పై ఐక్యపోరు
- 2 నుంచి 8 వరకు ఆందోళన
- 6న ప్రతిపక్ష ఎంపీలందరూ ఈసీ ఆఫీసుకు పాదయాత్ర
- ఇండియా కూటమి సంయుక్త కార్యాచరణ ఖరారు
- డీఎంకే, ఆప్, సమాజ్‌వాదీ డుమ్మా.. వర్చువల్‌గా యూబీటీ, జేఎంఎం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలో సర్ (SIR) వివాదంపై ర్యాలీలు, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ యాత్రలతో సహా ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఇండియా బ్లాక్(India Bloc) బుధవారం ఖరారు చేసింది. సీఈసీ, సర్ తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరపాలని సమావేశంలో అన్ని పార్టీలు అంగీకరించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Congress President Mallikarjun Kharge) అన్నారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్ నిర్వహిస్తామని, అలాగే 6న ప్రతిపక్ష ఎంపీ లంద రూ ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, జ్ఞానేశ్‌కుమార్ దాడి చేశారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
దేశంలో ఓట్ల కుంభకోణం జరిగిందని పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఈసీ జ్ఞానేష్(CEC Gyanesh Kumar)ను తక్షణమే తొలగించాలని 19 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ సెంటర్ భవనంలో నిర్వహించిన ఇండియా బ్లాక్ ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆప్‌తో సహా సమాజ్‌వాదీ పార్టీలు గైర్హాజరు అయ్యాయి. యూబీటీ, జేఎంఎం మాత్రం వర్చువల్‌గా పాల్గొనడం గమనార్హం.
ఈ ముఖ్య సమావేశానికి మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ మాజీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తదితర నాయకులు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన సంయుక్త బ్రీఫింగ్‌లో మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ.. సీఈసీ, సర్ అక్రమాలపై తాము ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని అన్నారు.
యువత, ఎన్జీవోలను భాగస్వాములను చేస్తూ, శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు ‘సేవ్ డెమోక్రసీ’ అనే నినాదంతో పాదయాత్రలు చేపట్టాలని, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ప్రదర్శనలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 6న ప్రతిపక్ష ఎంపీలందరూ ఎన్నికల సంఘం వద్దకు పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. ‘ఓటు దొంగ ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు భారత రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరి, అక్టోబర్ రెండో వారంలో వినతిపత్రం సమర్పిస్తారని పేర్కొన్నారు. ఇండియా కూటమి ఐదు భారీ ర్యాలీలు నిర్వహిస్తుందని, వాటి తేదీ, ప్రదేశం త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తామని ఖర్గే తెలిపారు.
ఎస్‌ఐఆర్, ఎన్నికల అవకతవకల కేసులను వేగవంతం చేయాలని భారత కూటమి నాయకులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారని ఖర్గే అన్నారు. ‘రాహుల్ జీ చెప్పింది సరైనదేనని ఇప్పుడు అందరూ గ్రహిస్తున్నారు. అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదట ప్రధాని మోదీ ‘నోట్ల రద్దు’ చేశారు. ఇప్పుడు ప్రజల హక్కులను హరిస్తూ ‘ఓట్ల రద్దు’ చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతికి తిరిగి వెళ్లాలని, ఇకపై అన్ని ఎన్నికలూ బ్యాలెట్ ద్వారానే జరగాలని, అలాగే అధి కారంలో ఉన్న ఈ ‘దొంగ ప్రభుత్వం’ చేసిన చట్టాలను రద్దు చేయాలని అందరూ వంద శాతం అంగీకరించారని ఖర్గే చెప్పారు.
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ వంటి కొందరు నాయకులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని ఆయన తెలిపారు. అందరూ ఏకగ్రీవంగా కలిసి పోరాడాలని ప్రతిజ్ఞ చేశారని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్‌ను నిజంగా నియంత్రించే ‘సూత్రధారులు‘ మోదీ, హోంమంత్రి అమిత్ షా అని ఖర్గే ఆరోపించారు. అక్కడ కనిపించే వ్యక్తులు కేవలం పావులు మాత్రమే నని, ఓట్ల దొంగతనం వెనుక ప్రధాని, హోంమంత్రి ఉన్నారని, అందుకే వారు ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రజాస్వా మ్యం కోసం పోరాడుతున్న వారిని వారు వేధిస్తున్నారని పేర్కొన్నారు.
ముగ్గురి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ధ్వంసం..
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ దాడి చేశారన్నదే అన్ని పార్టీల అభి ప్రాయ మని రాహుల్ గాంధీ అన్నారు. తాము దీనిని చూస్తూ ఊరుకోమని, భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని, ఎన్నికలను అపహరించారని ప్రజలకు తెలియజేయడంలో ప్రతిప క్షం బాగా విజయం సాధించిందని రాహుల్ గాంధీ చెప్పారు. ‘రాజ్యాంగాన్ని సమిష్టిగా రక్షించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులం దరిపై ఉందన్నారు.
ప్రజల ఓట్లను దొంగిలించారు: మమత
దేశంలో ఒక ‘పెద్ద కుంభకోణం’ జరిగిందని.. అదే.. ఓట్లు దోపిడీ అయ్యాయని, దాని పర్యవసానాలను ప్రజలు అనుభవిస్తున్నారని మమ తా బెనర్జీ అన్నారు. ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు. కానీ ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ఒక దొంగ, దోపిడీదారుడు అని బయటపడిందని చెప్పారు. ఆయన ప్రజల ఓట్లను దొంగిలించారని, ఈవీఎం యంత్రాలను తగులబెట్టారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని కాబట్టి, జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మూడు ప్రధాన పార్టీలు డుమ్మా
ఈ సమావేశా నికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీసీ(ఎస్పీ), శివసేన (యూబీటీ), రాష్ట్రీయ జనతా దళ్, సీపీఐ(ఎం), సీపీఐ, జమ్మూ అండ్‌కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఐ-ఎంఎల్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం, విదుతలై చిరుతైగళ్ కచ్చి, రివల్యూష నరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ కాంగ్రెస్(జాకబ్), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు హాజరయ్యాయి.
స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరయ్యారు. కానీ డీఎంకే, ఆప్, సమాజ్‌వాదీ డుమ్మా కొట్టగా, యూబీటీ, జేఎంఎం పార్టీలు వర్చువల్‌గా పాల్గొన్నాయి. ఎంతో కీలకమైన ఈ సమావేశానికి ప్రధాన పార్టీలే రానప్పుడు ప్రాంతీయ పార్టీలతో కొత్త పొత్తులకు ఇండియా బ్లాక్ పోనున్నదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.