వార్తలు రాస్తే థర్డ్‌ డిగ్రీనా?.. ఆసుపత్రిలో ఇద్దరు జర్నలిస్టులు

17-10-2026 | 01:33pm

కరీంనగర్‌ సిటీ, అక్టోబర్‌ 17 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో బాధితులుగా ఉన్న జర్నలిస్టులు పోతురి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌ కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజన్న ప్రెస్‌ క్లబ్‌ సిరిసిల్ల అధ్యక్షుడు కొంపెల్లి మహేష్‌ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అండగా ఉంటామని భరోసా కల్పించారు.

జర్నలిస్టులపై వేధింపులు ఆందోళనకరం

ఈ సందర్భంగా కొంపెల్లి మహేష్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. వార్తలు రాసే వారిపై దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతుందని అన్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మహేష్‌ డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం

బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా నిలవాలని కొంపెల్లి మహేష్‌ పిలుపునిచ్చారు. రాజన్న ప్రెస్‌ క్లబ్‌ సిరిసిల్ల బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం ముందుంటుందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాసే జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు