అంబేద్కర్ కల్పిత నాయకుడు పుస్తక విడుదలను తక్షణమే నిలిపివేయాలి
హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి, దేశద్రోహిగా పరిగణించి జైలుకు పంపాలి
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, రాష్ట్ర కన్వీనర్ మీసాల అరుణ్ కుమార్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, ఆధునిక భారతదేశ పితామహుడు, కోట్లాది అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చరిత్రను కించపరిచే విధంగా హమారా ప్రసాద్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని రచించడం అంబేద్కర్‌వాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మీసాల అరుణ్ కుమార్(State Convener Meesala Arun Kumar) అన్నారు.
గురువారం ఘట్ కేసర్ పట్టణంలో అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ హమారా ప్రసాద్ అంబేద్కర్ ని కించపరిచే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించే లేదా అవమానించే ఏ రచననైనాఅంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్ ఆశయాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైనవిగా మేము భావిస్తున్నామన్నారు.
అంబేద్కర్ కల్పిత నాయకుడు పుస్తక విడుదలను తక్షణమే నిలిపివేయాలని, పుస్తకంలోని విషయాలపై సమగ్ర విచారణ జరపాలని, అంబేద్కర్ గౌరవాన్ని కించపరిచే, చట్టవిరుద్ధమైన అంశాలు ఉంటే వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని, దేశ సమగ్రతకు లేదా రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టపరంగా నిర్ధారిత నేరాలు ఉంటే, తగిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని, నేరం రుజువైతే చట్టప్రకారం శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ రాష్ట్ర కన్వీనర్ మీసాల అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.