పండగ వేళ గ్యాస్ షాక్.. ఎంత పెరిగిందంటే?
పండగ వేళ గ్యాస్ షాక్.. కమర్షియల్ LPG సిలిండర్ ధరలు పెంపు!
న్యూఢిల్లీ: పండగ సీజన్లో వ్యాపారులకు గ్యాస్ ధరల( LPG Cylinder Price) పెంపు షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ప్రాంతాలను బట్టి 19 కేజీల సిలిండర్‌పై సుమారు రూ.60 నుంచి రూ.70 వరకు ధర పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సహా వాణిజ్య అవసరాలకు LPG(Commercial Gas Cylinder Price) వినియోగించే వ్యాపారులపై అదనపు భారం పడనుంది. తాజా పెంపుతో 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,810కి చేరింది. ఇక ముంబైలో రూ.2,764, చెన్నైలో రూ.2,983, పాట్నాలో ఏకంగా రూ.3,100కు పెరిగింది. నగరాన్ని బట్టి ధరల్లో తేడా ఉన్నప్పటికీ.. పెరిగిన రేట్లు వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
వ్యాపారులపై పెరగనున్న భారం
కమర్షియల్ LPG ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలు వంటి వ్యాపారాల నిర్వహణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే ముడి సరుకులు, కూరగాయలు, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా పెరగడం తమపై అదనపు ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగల సీజన్లో డిమాండ్ పెరుగుతున్న సమయంలో కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు రావడంతో.. దీని ప్రభావం ఆహార వ్యాపారాల ఖర్చులపై, తద్వారా వినియోగదారులపై పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.