- ఫండ్ రైజింగ్ మీట్‌లో భారీగా మద్దతుదారుల తాకిడి
- 1.64 లక్షల మంది వీక్షకులతో సైట్‌లో అంతరాయం
- 90 నిమిషాల్లో 16 కోట్ల విరాళాలు వెల్లువ
వాషింగ్టన్, జూలై 26: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహ్యారిస్ దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ప్రీపోల్ సర్వేలు కూడా కమలకు అనుకూలంగా వస్తున్నాయి. ఫండ్ రైజింగ్‌లోనూ ఉపాధ్యక్షురాలికి విశేష మద్దతు లభిస్తోంది. గురువారం ఫండ్ రైజింగ్ కోసం వైట్ విమెన్, ఆన్సర్ ది కాల్ పేరుతో జూమ్‌లో ఆన్‌లైన్ ఈవెంట్‌ను నిర్వహించగా 90 నిమిషాల్లో సుమారు 2 మిలియన్ డాలర్లు (రూ.16.48 కోట్లు) సమకూరినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ఇప్పటివరకు రికార్డు. ఈ జూమ్ మీటింగ్‌లో 1.64 లక్షల మంది పాల్గొనగా యూజర్ల తాకిడికి వెబ్‌సైట్ క్రాష్ అవడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఒబామా దంపతుల మద్దతు
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమల పేరు దాదాపుగా ఖరారైంది. మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా సైతం తమ అంగీకారాన్ని తెలిపారు. మీకు మద్దతు ఇస్తునందుకు నేను, మిషెల్ ఎంతో గర్వపడుతున్నాం. ఎన్నికల ప్రచారంతో పాటు మిమ్మల్ని వైట్‌హౌస్‌కు పంపే విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తాం అని కమలతో ఒబామా ఫోన్‌లో మాట్లాడారు.
నీ పిల్లలం మేం ఉన్నాముగా..
కమలపై రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పిల్లలు లేని మహిళల రోజువారీ జీవితం దయనీయంగా ఉందని, వారు దేశాన్నీ అలాగే మారుస్తారని ఆరోపించారు. ఈ విషయంలో కమల సవతి కూతురు కోలే మాట్లాడుతూ.. తాను ఉండగా కమల పిల్లలు లేనివారు ఎలా అవుతారని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ముగ్గురు పేరెంట్స్‌ను తాను ప్రేమిస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో డిబేట్‌కు సిద్ధమని కమల ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా నిర్ణయించేవరకు వేచి చూస్తానని స్పష్టం చేశారు. కాగా గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ ప్రధానికి కమల సూచించారు.