calender_icon.png 8 April, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్

08-04-2025 01:53:37 AM

  1. వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు నిర్ణయం
  2. చర్చల ద్వారా పరిష్కారానికి ఇండియా, ఇండోనేషియా మొగ్గు
  3. ఏప్రిల్ 8లోగా నిర్ణయం వెనక్కి తీసుకోండి
  4. చైనాను హెచ్చరించిన ట్రంప్
  5. మాంద్యం భయాలను తోసిపుచ్చిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్, ఏప్రిల్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల దెబ్బకు వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ టూ లామ్‌తో ట్రంప్ ఇటీవల సుంకాల విషయంపై ఫోన్‌లో సంభాషించారు.

ఈ నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై విధించే టారిఫ్‌లను వియత్నాం సున్నాకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను సున్నా చేసిన తొలి దేశంగా వియత్నాం నిలిచింది. అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు తైవాన్ ఆదివారం ప్రకటించింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ఈ నెల 6న కీలక సమావేశం నిర్వహించి, వాణిజ్య అడ్డకుంలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. 

చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ మొగ్గు

అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా దీ టుగా స్పందించింది. అమెరికాపై 34 శాతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే భారత్ ఈ కౌంటర్ యాక్షన్‌కు దూరంగా ఉండాలని భావిస్తుంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. ఇండోనేషియా కూడా ఇదే వి ధంగా యోచిస్తోంది. పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలపై దృష్టిపెట్టినట్టు ఇండో నేషియా ఆర్థిక వ్యవహారాల కో ఆర్డినేషన్ మంత్రి ఎయిర్లాంగా హర్టార్టో పేర్కొన్నారు.  

చైనాకు ట్రంప్ వార్నింగ్

అమెరికా దిగుమతులపై 34 శాతం టారిఫ్‌లు విధించనున్నట్టు చైనా చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. చైనా తన నిర్ణయాన్ని ఏప్రిల్ 8లోగా వెనక్కి తీసుకోకపోతే.. ఏప్రిల్ 9 నుంచి ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా 50శాతం టారిఫ్‌లను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, చైనా దిగుమతులపై ట్రంప్ 34శాతం టారిఫ్‌లను ప్రకటించగా దీటుగా స్పందించిన చైనా అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేయకుండా నిషేధం విధించాలని నిర్ణయించింది. 

ఇంకా మాంద్యం ఎక్కడిది?

ట్రంప్ సుంకాల ప్రభావంతో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భయాల నేపథ్యంలో ట్రంప్ స్వయంగా తన సొంత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘గతంతో పోలిస్తే నేను విధించిన సుంకాల కారణంగా చమురు ధరలు తగ్గగాయి.

వడ్డీ రేట్లతో పాటు ఆహార పదార్థాల రేట్లు కూడా తగ్గాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడి నుంచి వస్తుంది. ఆ ప్రచారంలో వాస్తవం లేదు. ఇన్ని రోజులుగా అమెరికా నుంచి బయటకు వెళ్లిన బిలియన్ డాలర్లు.. టారిఫ్‌ల ద్వారా వెనక్కి తిరిగి వస్తున్నాయి.’ అని పోస్ట్ చేశారు.