15-03-2025 12:45:12 AM
భారీ వాహనాలతో రోడ్ల పై గుంతలు
పట్టించుకోని అధికారులు
మఠంపల్లి, మార్చి ౧౪: సూర్యాపేట జిల్లా మఠంపల్లి నుండి హుజూర్ నగర్ మధ్యలో రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి . మఠంపల్లి మండలంలో సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ రహదారిపై నిత్యం భారీ వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో రోడ్లు గుంతల మాయంగా మారి ప్రమాదాలకు ఎక్కువగా తావునిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. రహదారిపై ఏర్పడ్డ గుంతలను పట్టించుకోకపోవడం, డెంజర్ జోన్, మలుపుల దగ్గర సిగ్నల్ బోర్డు లేకపోవడంప్రమాదలకు కారణం అవుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్లపై ఏర్పడ్డ గుంతలు ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ రోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. స్థానిక పరిశ్రమలు భారీ వాహనాలు తిప్పటమే తప్ప, రోడ్డు వైపు కన్నేత్తి చూసిన పాపానికి పోలేదని, పరిశ్రమ ద్వారా కోట్లు సంపాదించుకుంటున్నారే గాని వాహనాల వల్ల రోడ్లు గుంతలుగా మారుతున్న పట్టించుకోకపోవడం లేదనేది స్థానికుల ఆరోపణ. అంతే కాకుండా భారీ వాహనాలను అతి వేగంగా నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని, రాత్రి 9 దాటితే పరిశ్రమల నుండి వచ్చే వాహనాలకు బ్రేకులతో పనే లేదన్నట్లుగా నాడుతారని పలువురు అంటున్నారు. దానికి తోడు రోడ్ల వెంబడి చౌటపల్లి గ్రామం నుండి బక్క మంతులగూడెం చివరివరకు నాటిన మొక్కలు వృక్షాలుగా మారి రోడ్డును కప్పి చేస్తున్నాయని అధికారులు చొరవ తీసుకొని భారీ వాహనాలపై నిఘా ఉంచి, హై స్పీడ్ తో నిర్లక్ష్యం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రక్కల ఉన్నటువంటి చెట్లను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నివారణ చర్యలు తీసుకుంటాం ..
హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు రోడ్డు విస్తరణ కొరకు దాదాపు 80కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు విస్తరణ పనులు త్వరలో జరుగుతాయని కాబట్టి, ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు మధ్యలో రెడ్ సిగ్నల్, డెంజర్ జోన్, మలుపుల దగ్గర సిగ్నల్ బోర్డు ఏర్పాటు చేస్తాము. , ప్రమాదాలు జరగకుండా తగ్గు చర్యలు తీసుకుంటాము. ఈ విషయం పై అధికారులకు సమాచారం అందిస్తాము.
ఆర్ అండ్ బి ఏఈ కిరణ్