calender_icon.png 26 October, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు సున్నానే!

29-07-2024 02:29:59 AM

పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయమే 

మా పాలనలో ప్రజలకు కాదు.. కేసీఆర్ ఫ్యామిలీకే నష్టం

ఆయన కుటుంబం ఆపదలో పడినందుకే గగ్గోలు 

జైపాల్‌రెడ్డి వల్లే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ 

సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటించి ఉంటే.. ఆనాడే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది 

కల్వకుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కల్వకుర్తిపై వరాల జల్లు కురిపించిన సీఎం

నాగర్‌కర్నూల్, జూలై 28 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో గుండుసున్నా తెచ్చుకొన్న బీఆర్‌ఎస్ పార్టీకి.. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ సున్నానే రాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని బీఆర్‌ఎస్ అంటున్నదని.. కానీ కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనని తెలి పారు. కేసీఆర్ కుటుంబం ఆపదలో పడినందుకే బీఆర్‌ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

ఆదివారం మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి మండలం కొట్ర చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అంతకుముందు కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి పార్లమెంట్ వేదికగా అప్పటి లోక్‌సభ స్పీకర్ మీనా కుమారితో మాట్లాడి పార్లమెంటులో బిల్లు పాస్ కావడానికి సూత్రధారి సూదిని జైపాల్‌రెడ్డి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు.

పదవులకే వన్నె తెచ్చిన నేత 

‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు.. నేను నల్లమల బిడ్డనే. మీ సోదరుడినే.. ఈ ప్రాంత అభిృద్ధికి కట్టుబడి ఉన్నా’ అని సీఎం రేవంత్ తెలిపారు. జైపాల్‌రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారని అన్నారు. నమ్మిన సిద్ధాంతం మేరకే  రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. పదవులతో ఆయనకు గుర్తింపు రాలేదని, ఆయన వల్లనే పదవులకు వన్నె వచ్చిందని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసి పడుతున్న సమయంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా అప్పటి స్పీకర్ మీనా కుమారికి ఇచ్చిన సలహాతో పార్లమెంటు తలుపులు మూసి మైక్ కట్‌చేసి బిల్లు పాస్ చేశారని తెలిపారు. కానీ ఆ తర్వాత జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్లే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని చెప్పారు.

ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తి దవాఖానను 50 నుంచి 100 పడకలకు పెంచుతామని తెలిపారు. ఆర్‌అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మాడ్గుల మండల ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచేందుకు రూ.10 కోట్లు, నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు నూతన రోడ్లు, కల్వకుర్తి-  మధ్య నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాను చదువుకున్న తాండ్ర పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నామని, అందుకు 50 ఎకరాల్లో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 

ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి

ఈ నెల 31లోగా రైతుల రుణాలు లక్షన్నర వరకు మాఫీ చేస్తామని, ఆగస్టు చివరినాటికి రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతామని సీఎం ప్రకటించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని ఆయన కుమారుడు కేటీఆర్ చెప్పిన గంటలోపే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, దీన్నిబట్టి తండ్రి కొడుకుల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు కనిపిస్తున్నదని అన్నారు. బీఆర్‌ఎస్ ఓటమితో కేసీఆర్ కుటుంబానికి నష్టం జరగొచ్చు కానీ ప్రజలకు కాదని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారని, ఐనా వారి బుద్ధి మారలేదని విమర్శించారు. లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు అదేవిధంగా బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని, వారిని గెలిపించి అభివృద్ధి కార్యక్రమాలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు.