- హామీల అమలుకు ఉద్యమిస్తాం
- ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : రేవంత్ ఏడాది పాలనలో అభివృద్ధి ‘సున్నా’ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుకు తాము ఏడాది గడువు ఇచ్చామన్నారు.
అయినా ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో గోషామహల్‌కు చెందిన సీనియర్ నాయకుడు పురుషోత్తం సహా పలువురు నాయకులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2లక్షల చొప్పున రూ.31వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ.17వేల కోట్లతో సరిపెట్టిందని విమర్శించారు.
రాష్ర్టంలో 50 శాతం రైతులు అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే.. కొందరు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నెలకొన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా రైతులు భరోసా కోల్పోయారన్నారు. ఏడాది పాలనలో సుమారు వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశపారపర్య రాజకీయాలకు, కుటుంబపాలనకు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
కాంగ్రెస్ గ్యారంటీ అంటే.. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో హిందువుల మనోభావాలను గాయపరచడమేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ హైడ్రా, మూసీనది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తాము ఉద్యమబాట చేపడుతామని స్పష్టం చేశారు. 11 కోట్ల కొత్త సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ రూపాంతరం చెందిందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కల సాకారం చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని లక్ష్మణ్ వెల్లడించారు.