calender_icon.png 15 November, 2024 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా జీరో దందా..

15-11-2024 12:09:28 AM

  1. రూ.కోట్లలో వ్యాపారం.. తెల్ల కాగితాలే బిల్లులు 
  2. జీఎస్టీ ఎగవేతకు ‘బుక్క చిట్టీ’ల చిట్కా..
  3. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వనపర్తి, గద్వాల జిల్లాల వ్యాపారులు 

వనపర్తి, నవంబర్ 14 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీయాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఒక వస్తువుపై క్రయ విక్రయాలు జరిపినప్పుడు వినియోగదారుడు, లబ్ధిదారుడు ఇరువురికీ మేలు జరిగేలా చూడడమే దీని ఉద్దేశం.

దేశ వ్యాప్తంగా ఆ వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా.. విక్రయించినా ఒకే పన్ను ఉండేలా పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఇలా చేయ డం వల్ల వినియోగదారుడితో పాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. అయి తే వనపర్తి, గద్వాల జిల్లాల్లో మాత్రం వ్యాపారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారు.

క్రయవిక్రయాల్లో రూ.కోట్లు గడిస్తూ వినియోగదారులకు బుక్క చిట్టీల (తెల్లకాగితాల పైనే)ను బిల్లుగా ఇస్తున్నారు. ఇది సరి పోక లావాదేవీలు సైతం లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకుంటూ నల్లధనాన్ని భారీగా వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వస్త్ర, బంగారం దుకాణాలు, కిరాణ, వర్తక వ్యాపార సముదాయాలు సైతం ఇదే పద్ధతిలో రూ.వందల కోట్లు ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన లబ్ధిదారుడు దాని నాణ్యతా ప్రమాణాల విషయంలో నష్టం జరిగితే వారిని ప్రశ్నించే హక్కును కోల్పోతున్న పరిస్థితి నెలకొన్నది.

దీనికి తోడు నాసిరకం వస్తువులను తీసుకొచ్చి మొదటి రకం వస్తువులుగా నమ్మిస్తూ తక్కువ ధరకు అంటగడుతూ వినియోగదారులను నిలువునా దోచుకుం టున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు మామూళ్లకు అల వాటు పడి అటువై పు కన్నెత్తి కూడా చూడడంలేదన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. 

బంగారం దుకాణాల్లోనూ.. 

వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలోని బం గారు దుకాణాల యజమానులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.500కు పైన కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు సంబంధించి దుకాణదారుడు జిఎస్టీ బిల్లును నమోదు చేయాలి. కానీ వినియోగదారుడు రూ.లక్షల్లో బంగారం కొనుగోలు చేసినా తెల్లని కాగితంపై బిల్లులు రాసిస్తూ వ్యాపారం చేస్తున్నారు. జీఎస్టీ బిల్లు ఇవ్వకపోవడం వల్ల ఈ వస్తువులను ఇతర దుకాణాల్లో తక్కువ ధరకే విక్రయించే పరిస్థితి. బంగారం దుకాణాల్లో రూ.కోట్లల్లో బుక్క చిట్టీల దందా జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోకపోవడం తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏజెన్సీల నుంచే మొదలు..

ఆయా కంపెనీలకు చెందిన వస్తువులను జిల్లా  కేంద్రాల్లో ఒక ఎజెన్సీకి తీసుకొచ్చి అక్కడి నుంచి వ్యాపార సముదాయాలకు తరలిస్తుంటారు. ఏజెన్సీలకు ఇచ్చే ప్రతి వస్తువుకు ఇన్‌వాయిస్ (బిల్లు రూపంలో)ను కంపెనీ ఇస్తుంది. కానీ వాటిని ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్దే ఉంచుకొని వ్యాపార సముదాయాల వారికి తెల్ల కాగితాలపై బిల్లులు రాసి ఇస్తున్నారు. దీనికి తోడు పలు కంపెనీలు కొన్ని వస్తువులపై ఇచ్చే ఆఫర్లను సైతం వీరు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా చూస్తుంటే బుక్కచిట్టీల దందా ఏజెన్సీల నుంచే ప్రారంభమవుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది.