calender_icon.png 25 October, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీరో బ్రోకరేజ్ ముగిసినట్టే!

03-07-2024 01:44:14 AM

  • సెబీ తాజా ఉత్తర్వులు కారణం 
  • జిరోథా వ్యవస్థాపకుడు నితిన్ కామర్

న్యూఢిల్లీ, జూలై 2: మార్కెట్ మౌలిక సంస్థలైన స్టాక్ ఎక్సేంజీలు, బ్రోకరేజ్ సంస్థలు, స్టాక్ క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీల చార్జీలు అన్నీ ఒకేరీతిలో ఉండాలంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీలు, ఎక్సేంజ్ బోర్డు (సెబీ) కొత్తగా విడుదల చేసిన సర్క్యులర్‌తో జీరో బ్రోకరేజ్ వ్యవస్థ ముగిసినట్టేనని దేశంలో ప్రధాన బ్రోకరేజ్ కంపెనీ జిరోథా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ అన్నారు. చార్జీలు లావాదేవీల పరిమాణం ఆధారంగా కాకుండా ఏకరీతిలో ఉండాలంటూ సెబీ విడుదల చేసిన సర్క్యులర్ ప్రభావం బ్రోకర్లు, ట్రేడర్లు, ఇన్వెస్టర్లపై ప్రతికూలంగా ఉంటుందన్నారు.

తాము జీరో బ్రోకరేజ్ వ్యవస్థను ముగించి, ఈక్విటీ డెలివరీలపై చార్జీలు విధించాల్సి ఉంటుందని, లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చార్జీలను పెంచాల్సి ఉంటుందని కామత్ చెప్పారు.  బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చే టర్నోవర్ ఆధారంగా స్టాక్ ఎక్సేంజీలు లావాదేవీ ఫీజు వసూలు చేస్తున్నాయని, దానితో ఎక్కువ టర్నోవర్ చేసే బ్రోకర్లకు నెల చివరినాటికి రిబేటు లభిస్తుందని, ఈ ప్రక్రియ ప్రపంచ ప్రధాన మార్కెట్లు అన్నింటిలో సాధారణమేనని తెలిపారు.

తమ ఆదాయంలో స్టాక్ ఎక్సేంజీల నుంచి 10 శాతం వరకూ రిబేటు వస్తున్నదని, పరిశ్రమలో ఇతర బ్రోకర్లకు లభించే రిబేటు 10 శాతం మధ్య ఉంటుందన్నారు. సెబీ కొత్త సర్క్యులర్‌తో తమ ఆదాయం తగ్గుతుందని చెప్పారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఆదాయంలో కొంతభాగాన్ని ఈక్విటీ డెలివరీ ఇన్వెస్టర్లకు మళ్లించి వారికి ఉచిత ఈక్విటీ డెలివరీని ఇస్తున్నామని కామత్ వివరించారు. ఉచితంగా డెలివరీ ట్రేడ్‌చేసుకునే అవకాశం కల్పిస్తున్న అతికొద్ది బ్రోకరేజ్‌ల్లో జిరోథా ఒకటని తెలిపారు.

కానీ తాజా నిబంధనల కారణంగా తాము ఉచిత డెలివరీకి ముగింపుపలకడం లేదా ఎఫ్ అండ్ ఓ ట్రేడ్స్‌పై చార్జీలు పెంచడం మినహా మార్గం లేదన్నారు.  డెరివేటివ్ మార్కెట్లో పెరిగిపోతున్న ట్రేడింగ్‌ను అదుపుచేసే క్రమంలో సెబీ సర్క్యులర్‌ను జారీచేసింది.