calender_icon.png 19 April, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాకు మేం ఆయుధాలు సమకూర్చడం లేదు..!

18-04-2025 11:21:42 PM

మాపై జెలెన్‌స్కీ వ్యాఖ్యలు.. పచ్చి అబద్ధాలు:  చైనా

బీజింగ్: ‘రష్యాకు మేం ఆయుధాలు సరఫరా చేయడం లేదు. మందుగుండు సామగ్రి సమకూర్చడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాపై చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నాం. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాం’ అంటూ బీజింగ్ నుంచి ప్రకటన విడుదలైంది. రష్యాకు చైనా ఆయుధ సామగ్రి, మందుగుండు సామగ్రి సమకూరుస్తున్నదని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మీడియా ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా భూభాగంలో ఆయుధాలు సైతం తయారు చేయిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతున్న వేళ.. చైనాతో రష్యా బలమైన ఆర్థికపరమైన, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నది.

ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద దుమారం రేపాయి. చైనాపై ఇంత బాహాటంగా జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్ జియాన్  ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జెలెన్‌స్కీ మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తాము రష్యాకు ఎలాంటి మారణాయుధాలు సరఫరా చేయడం లేదు. ఆ దేశంలో ఆయుధాలను తయారు చేయించడం లేదు. రష్యాలో దిగుమతి అయ్యే ఆయుధాల్లో చైనావి లేవు. మేం ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య సీజ్ ఫైరింగ్ (కాల్పుల విరమణ)నే కోరుకుంటున్నాం. అందుకు మేం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.