న్యూఢిల్లీ: భారత జావెలిన్ స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా వచ్చే సీజన్ కోసం కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజ ఆటగాడు జాన్ జెలెజ్నీని ఎంపిక చేసుకున్నాడు. 58 ఏళ్ల జాన్ జెలెజ్నీ ఈ తరంలో గొప్ప జావెలిన్ త్రోయర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన జెలెజ్నీ మూడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్‌ను కూడా అందుకున్నాడు.
1996 జర్మనీ ఈవెంట్‌లో జెలెజ్నీ జావెలిన్‌ను 98.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదర లేదు. గతంలో జెలెజ్నీ జాకుబ్ వద్లెచ్ , వెస్లే, బార్బోరా లాంటి చాంపియన్లను తీర్చిదిద్దాడు. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించినప్పటికీ నీరజ్‌కు 90 మీటర్ల దూరం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మరి కొత్త కోచ్ జెలెజ్నీ హయాంలో ఆ ముచ్చటను తీర్చుకుంటాడేమో చూడాలి.