calender_icon.png 10 October, 2024 | 3:47 AM

జీ, సోనీ వివాదానికి తెర

28-08-2024 12:30:00 AM

క్లెయింలను వెనక్కు తీసుకున్న కంపెనీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 27: జీ ఎంటర్‌టైన్‌మెంట్, జపాన్‌కు చెందిన సోనీ పిక్చర్స్ 10 బిలియన్ డాలర్ల విలీనం ఆరు నెలల క్రితం విఫలమైన నేపథ్యంలో ఇరు కంపెనీల మధ్య తలెత్తిన వివాదాలను ఎట్టకేలకు పరిష్కరించుకున్నాయి. ఒకదానిపై మరోటి వేసుకున్న క్లెయింటను ఉపసంహరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. మంగళవారం ఈ మేరకు  జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 2021 డిసెంబర్‌లో ఈ రెండు కంపెనీలు విలీన ఒప్పందం కుదుర్చుకోగా, తదుపరి అది విఫలమయ్యింది. విలీన ఒప్పందాన్ని పాటించనందుకు 90 మిలియన్ డాలర్లు (రూ.748 కోట్లు) టెర్మినేషన్ ఫీజును  జీ, సోనీలు రెండూ క్లయిం చేస్తూ అంతర్జాతీయ వివాదాల కోర్టుకు ఎక్కాయి.

వివాదం ఇదీ..

సోనీ ఈ ఏడాది జనవరిలో విలీన ఒప్పందాని రద్దు చేసుకుంది. విలీన షరతుల్ని జీ అంగీకరించలేదని, 90 మిలియన్ డాలర్లు టెర్మినేషన్ ఫీజును చెల్లించా లంటూ సింగపూర్ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐ ఏసీ)ని సోనీ ఆశ్రయించింది. సోనీకి ఎటు వంటి పరిహారం ఇచ్చేది లేదంటూ ఎస్‌ఐఏసీ ఎదుట జీ వాదనల్ని విన్పించింది.  ప్రతిపాదిత విలీనం అమలుకోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించి, తదుపరి ఆ వినతిని ఉపసంహరించుకుంది.

2024 మే నెలలో విలీన ఒప్పందాన్ని జీ రద్దుచేసుకుంటూ సోనీ గ్రూప్ నుంచి 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ ఫీజును డిమాండ్ చేసింది. పరిష్కార ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు ఒకదానికి మరోటి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజా ప్రకటనలో జీ, సోనీలు పేర్కొన్నాయి. భవిష్యత్ వృద్ధి అవకాశాల్నిస్వతంత్రంగా అన్వేషించు కోవాలని నిర్ణయించాయి. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు 15 శాతం జంప్

సోనీ పిక్చర్స్‌తో విలీన వివాదం పరిష్కారం అయినట్టు ప్రకటన వెలువడిన నేపథ్యంలో మంగళవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 15 శాతం పెరిగి రూ.154.9 వద్దకు చేరింది. చివరకు 11.5 శాతం లాభంతో రూ.150.80 వద్ద ముగిసింది.