- పోలీసుల చర్యతో ప్రశాంత వాతావరణం
- జైనూర్‌లో కొనసాగుతున్న 144 సెక్షన్
- అల్లర్ల నేపథ్యంలో డీఎస్పీపై బదిలీ వేటు
కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): ఆదివాసి మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటనతో జైనూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ ఉన్నతాధికారులు చేపట్టిన చర్యలతో అక్కడ ప్రశాంత వాతావారణం నెలకొన్నట్లు కనిపిస్తున్నది. శుక్రవారం ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, వాం కిడి, రెబ్బెనతో పాటు పలు మండలాల్లో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
జైనూర్ పోలీసుల ప్రహారలో ఉండటంతో అక్కడ కర్ఫ్యూ వాతావారణం నెలకొంది. ప్రధాన రాహదారిపై ఉన్న దుకాణాల్లో మిగిలిన సామగ్రిని వ్యాపారులు తరలిస్తున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనపు డీజీ మహేష్ భగవత్, అదపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ డీవీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు జైనూర్‌లో మాకం వేశారు. కాగా ఈ నెల 4న జరిగిన అల్లర్ల నేపథ్యంలో డీఎస్పీ సదయ్యను ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
ఆయన స్థానంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్‌ను ఆసిఫాబాద్ డివిజన్ అధికారిగా నియమిస్తూ శుక్రవారం మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిఘా వర్గాల వైఫల్యంతోనే డీఎస్పీ సదయ్యపై వేటు పడిందని చర్చ జరుగుతున్నది. జైనూర్‌లో జరిగిన దుర్ఘటను నిరసిస్తూ ఏజెన్సీ మండలాలు తిర్యా ణి, లింగాపూర్, సిర్పూర్(యు), కెరమెరి, వాంకిడిలో బంద్ కొనసాగుతున్నది. ఆదివాసీ మహిళపై దాడికి యత్నించిన నింది తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందు పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజలింగు, సతీష్ శుక్రవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం అందజేశారు.
సమగ్ర విచారణ జరుపాలి
నిర్మల్(విజయక్రాంతి): జైనూర్‌లో ఆదివాసి మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. జిల్లా అధ్యక్షురాలు రజని మాట్లాడుతూ.. ఆదివాసి మహిళపై దాడి పతకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. నిందితుడికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసనలో మహిళా నాయకులు అతివేలు మంగ, భూలక్ష్మి, లలిత, సుష్మారెడ్డి, దీప, సుజాత పాల్గొన్నారు.