calender_icon.png 8 October, 2024 | 10:09 AM

ఇస్లాంపై యువతితో జాకీర్ వాగ్వాదం

08-10-2024 01:44:02 AM

  1. పిల్లలపై లైంగిక హింసపై యువతి ఆరోపణ
  2. ఆగ్రహిస్తూ క్షమాపణలు చెప్పాలని జాకీర్ డిమాండ్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: పరారీలో ఉన్న ఇస్లాం బోధకుడు జాకీర్ నాయక్‌తో పాక్‌కు చెందిన ఓ అమ్మాయి ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇస్లామిక్ సమాజాలలో పెడోఫిలియా (పిల్లలపై లైంగికదాడులు) వంటి సామాజిక రుగ్మతల వ్యాప్తిపై ప్రశ్నించగా ఆమెను జాకీ ర్ తిట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.

పాక్ పర్యటనలో భాగంగా కరాచీ బహిరంగ సభలో ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పష్తూన్ వర్గానికి చెందినట్లు పేర్కొన్న ఆ యువతి మాట్లాడుతూ.. నేను నివసించే చోట మతాన్ని కఠినంగా పాటించేవాళ్లు ఉన్నా పెడోఫిలియా, వ్యభిచారం, డ్రగ్స్‌కు బానిసగా మారడం వంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఉలేమాలు వీటిని ఎందుకు వ్యతిరేకించడం లేదు? మహిళలకు పరిమిత స్వేచ్ఛ మాత్రమే ఎందుకు? అని సభా వేదికగా ప్రశ్నించింది. 

యువతి ప్రశ్నకు మొదట చులకనగా సమాధానమిచ్చిన జాకీర్.. ఆడవాళ్ల అడుగుజాడల్లో మగవారు నడవాలని, పురుషులు ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ఎగతాళిగా మాట్లాడాడు. యువతి మాట్లాడుతుండగా ఆమెకు పదేపదే అడ్డుపడ్డాడు. ఖురాన్‌లో పెడోఫిలియా గురించి ప్రస్తావన లేదని, ఇస్లాం పరువు తీసేలా మాట్లాడావని యువతిపై ఆరోపణలు చేశాడు.

ఒక ముస్లిం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడడు. ఆరోపణలు చేసేముందు 10 సార్లు ఆలోచించాలి. నువ్వు తప్పు చేశావు. ఈ వ్యాఖ్యలకు తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అని యువతిపై మండిపడ్డాడు. జాకీర్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విస్తృతమైన విమర్శలకు దారితీసింది.