మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
నల్లగొండ, జనవరి 31 (విజయక్రాంతి): మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ గ్రామానికి వస్తున్నారని తెలిసి దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం శివారులో వైటీపీఎస్ భూనిర్వాసితులు ప్లకార్డులు పట్టుకొని శుక్రవారం నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యేను తమ గ్రామానికి రానివ్వబోమని నినాదాలు చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)లో భూములు కోల్పోయిన తమకు అన్యాయం చేసి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించారు. పదేండ్లు తమను ఇబ్బందికి గురి చేసి ఏముఖం పెట్టుకొని గ్రామానికి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మద్దతు ప్రకటించారు.
విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. కాగా కాంగ్రెస్ నేతలు కొందరు అమాయకులను రెచ్చగొట్టి మాజీ ఎమ్మెల్యేపై ఉసిగొల్పుతున్నారని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.