ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డన్నారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారికి అండగా ఉండాలని ప్రశ్నించే గొంతుకగా మండుటు ఎండలో పాదయాత్ర చేస్తూ ఎక్కడికి అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటిని పరిష్కరిస్తూ రైతును రాజుగా చేయడం లక్ష్యంగా పనిచేశారు. మహిళలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారు.. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేలా చేశారు. రైతన్నకి సాగునీరు అందించాలని జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆనేక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వారి అకాల మరణం బాధాకరం. ఆ మహానేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నామన్నారు. ఆనాడు రాజశేఖరరెడ్డి చేసిన ఆలోచనలతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరిన్ని కొత్త ఆలోచనతో ముందుకు పోతున్నారు. రాహుల్ గాంధీ మొన్న చేసిన పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను గుర్తు చేశారు.. రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సంకల్పించారు. వారి ఆలోచన విధానాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టుదలతో ముందుకు తీసుకెళ్తూ రాబోవు రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా చూడాలని తపించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయాలని అన్నారు.